ఏడు నిమిషాల్లో పనిచేసే క్యాన్సర్ ఇంజెక్షన్

  • ఒక్క డోస్ ధర రూ.3.7 లక్షలు
  • ఊపిరితిత్తుల క్యాన్సర్ రోగులకు ఉపయోగం
  • క్యాన్సర్‌ కణాలను గుర్తించి నయం
  • ప్రభుత్వ పథకాల ద్వారా రీయింబర్స్‌మెంట్
భారతదేశంలో క్యాన్సర్ చికిత్సలో విప్లవాత్మక ముందడుగు పడింది. ఊపిరితిత్తుల క్యాన్సర్ రోగుల కోసం కేవలం ఏడు నిమిషాల్లో పనిచేసే సరికొత్త ఇంజెక్షన్‌ అందుబాటులోకి వచ్చింది. రోచ్ ఫార్మా ఇండియా సంస్థ ‘టెసెంట్రిక్’ పేరుతో ఈ ఇమ్యునోథెరపీ మందును మార్కెట్‌లోకి విడుదల చేసింది.

గతంలో ఐవీ ఇన్‌ఫ్యూజన్‌ ద్వారా ఆసుపత్రిలో గంటల కొద్దీ సమయం తీసుకునే ఈ ప్రక్రియ ఇప్పుడు చర్మం కింది భాగంలో ఇచ్చే ఇంజెక్షన్ ద్వారా కేవలం ఏడు నిమిషాల్లోనే పూర్తవుతుంది. భారతదేశంలో అత్యధికంగా కనిపించే ‘నాన్-స్మాల్ సెల్ లంగ్ క్యాన్సర్’ (ఎన్‌ఎస్‌సీఎల్‌సీ) బాధితుల కోసం ఈ చికిత్సను రూపొందించారు. దీనివల్ల రోగులకు ఆసుపత్రిలో వేచి ఉండే సమయం, మానసిక ఒత్తిడి తగ్గుతాయి.

ఈ కొత్త పద్ధతి రోగులకు ఎంతో సౌకర్యంగా ఉన్నప్పటికీ, ధర మాత్రం సామాన్యులకు పెనుభారంగా మారింది. ఈ ఇంజెక్షన్ ఒక్క డోస్ ధర దాదాపు రూ.3.7 లక్షలు. క్యాన్సర్ నయం కావడానికి రోగులు సాధారణంగా ఆరు డోసుల వరకు తీసుకోవాల్సి ఉంటుందని వైద్యులు చెబుతున్నారు.

కీమోథెరపీలా కాకుండా ఇమ్యునోథెరపీ శరీరంలోని రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేసి క్యాన్సర్ కణాలపై పోరాడేలా చేస్తుంది. ఈ ఇంజెక్షన్‌లోని ‘అటెజోలిజుమాబ్’ అనే మందు క్యాన్సర్ కణాల్లో ఉండే పీడీ-ఎల్1 ప్రొటీన్‌ను అడ్డుకుంటుంది. ఇది బ్లాక్ అవడం వల్ల శరీరంలోని రోగనిరోధక కణాలు క్యాన్సర్ సెల్స్‌ను సులభంగా గుర్తించి నాశనం చేస్తాయి.

ఈ మందుల తయారీలో వాడే అధునాతన సాంకేతికత, లోతైన పరిశోధనల వల్లే ధరలు ఎక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. రోగులపై ఆర్థిక భారాన్ని తగ్గించడానికి రోచ్ సంస్థ ‘బ్లూ ట్రీ’ అనే సహాయక కార్యక్రమాన్ని ప్రారంభించింది. కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం (సీజీహెచ్‌ఎస్‌) కింద కూడా ఈ చికిత్సకు రీయింబర్స్‌మెంట్ సదుపాయాన్ని కల్పించారు.

Tecentriq
Lung Cancer
Cancer Injection
Roche Pharma India
Immunotherapy
NSCLC
Atezolizumab
Cancer Treatment India
Blue Tree Program

More Telugu News